Ramky: నీటి వనరుల పరిరక్షణకు డీప్ టెక్: ఇంజినీర్స్ డే సందర్భంగా రామ్‌కీ ఇన్‌ఫ్రా ఎండీ వై.ఆర్.నాగరాజ కీలక సూచనలు

58వ ఇంజినీర్స్ డే సందర్భంగా, భారత్‌లోని అందరు ఇంజినీర్లకు నమస్కారాలు. ఈ దేశానికి పునాదులు వేసినవారు, ప్రస్తుతం కష్టపడుతున్నవారు, భవిష్యత్తుకు మార్గదర్శనం చేయబోయే వారందరికీ నా కృతజ్ఞతలు. ఇంజినీర్లు.. రహదారుల నుంచి స్మార్ట్ వాటర్ గ్రిడ్ల వరకు అన్నింటికీ వెన్నెముకగా నిలిచారు. మీ కృషి వల్లే మనం మౌలిక సదుపాయాలను మాత్రమే కాకుండా, పర్యావరణాన్ని కాపాడే, జీవితాలను మెరుగుపరిచే భవిష్యత్తును నిర్మిస్తున్నాం. బలమైన ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యకరమైన పర్యావరణం కోసం మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు.
ఈ సంవత్సరం థీమ్.. “డీప్ టెక్ & ఇంజినీరింగ్ ఎక్సలెన్స్: డ్రైవింగ్ ఇండియాస్ టెకేడ్”. దేశంలో ప్రతిరోజూ 72,368 మిలియన్ లీటర్ల (MLD) మురుగునీరు(పట్టణాల్లో) ఉత్పత్తి అవుతోంది. కానీ దానిని శుద్ధి చేసే సామర్థ్యం కేవలం 31,841 MLD మాత్రమే. అందులో కూడా పనిచేసే సామర్థ్యం ఇంకా తక్కువగా ఉంది. సుమారు 28% మురుగునీరు మాత్రమే శుద్ధి అవుతోంది. మిగతా 72% శుద్ధి కాకుండానే మన నీటి వనరులను కలుషితం చేస్తోంది.
సహజంగా చాలా భారతీయ నగరాల్లో, తాగునీరు వినియోగదారులకు చేరకముందే 40-50% నష్టపోతుంది. ఇది పైపుల లీకులు, దొంగతనం, మీటర్లలో లోపాలు, బిల్లు వేయని కనెక్షన్ల వల్ల జరుగుతుంది. ఇలా ఆదాయం రాకుండా పోయే నీరు కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదు, నీటి భద్రతకు, ప్రజారోగ్యానికి, భవిష్యత్తులో నీటి లభ్యతకు కూడా పెనుముప్పు వాటిల్లుతోంది.
ఈ సంఖ్యలు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సుస్థిరమైన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, ఇంజినీరింగ్ నైపుణ్యం అనేది ఆవిష్కరణ (innovation), సమగ్రత (integration), ప్రభావం (impact) అనే మూడు అంశాలపై ఆధారపడి ఉండాలి. కేవలం నిర్మించడం సరిపోదు. మనం మరింత మెరుగ్గా నిర్మించాలి. ఉదాహరణకు, స్మార్ట్ ఎస్టీపీలు (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్) మురుగునీటిని శుద్ధి చేయడమే కాకుండా, అందులో ఉన్న విలువైన వనరులను కూడా పునరుద్ధరించాలి. అదేవిధంగా, స్మార్ట్ వాటర్ గ్రిడ్లు రియల్ టైమ్ సెన్సార్లను ఉపయోగించి లీకులను గుర్తించాలి. భవిష్యత్తు అవసరాలను అంచనా వేయడానికి డిజిటల్ ట్విన్స్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలి. అంతేకాకుండా, సుస్థిరమైన పారిశ్రామిక పార్కులను నీటి వృత్తాకార వ్యవస్థలు (circular water systems), పునరుత్పాదక శక్తితో రూపొందించాలి. ఈ ప్రణాళికలన్నీ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడటం ప్రభుత్వ విధానాల ప్రధాన లక్ష్యం కావాలి.
ఇంజినీర్స్ డే సందర్భంగా, నేను ఇంజినీర్లు, పరిశ్రమలు, ప్రభుత్వ నిర్ణేతలను ఒక ముఖ్యమైన విషయానికి పిలుస్తున్నాను. మనం అందరం కలిసి నీటి సమస్యలకు పరిష్కారం చూపాలి. మనం తయారు చేసే ప్రతి లీటర్ మురుగునీటిని శుద్ధి చేసి మళ్లీ వాడాలి. ప్రతి నీటి వ్యవస్థలో వృథా తగ్గించి, సామర్థ్యం పెంచాలి. అలాగే, ప్రతి పరిశ్రమలో పర్యావరణానికి మేలు చేసే పద్ధతులను పాటించాలి. ఇలా మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే, దేశం నిజంగా అభివృద్ధి చెంది, సుస్థిరంగా మారుతుంది.