Hyderabad: హైదరాబాద్ చుట్టుప్రక్కల భూములకు డిమాండ్

రైల్వే శాఖ ఈ కొత్త టెర్మినల్స్‌ను ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ మధ్య నిర్మించాలని యోచిస్తోంది. ఈ నిర్ణయం ఆయా ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ (Real Estate), వ్యాపార అభివృద్ధికి కొత్త మార్గాలను సూచిస్తుంది. నాగులపల్లి టెర్మినల్ (వికారాబాద్-ముంబై మార్గం): ఈ ప్రాంతంలో ఇప్పటికే డిమాండ్ ఉండగా.. కొత్త టెర్మినల్ నిర్మాణం ఇక్కడ రియల్ ఎస్టేట్ విలువలను గణనీయంగా పెంచుతుంది. ముంబై వైపు నుంచి వచ్చే వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు ఈ ప్రాంతంలో విస్తరించడానికి ఇది ఒక ప్రధాన కారణమవుతుంది. జూకల్-శంషాబాద్ టెర్మినల్ (మహబూబ్‌నగర్-బెంగళూరు మార్గం): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ టెర్మినల్ రావడం వల్ల ప్రయాణికులకు రైలు, విమాన ప్రయాణాలను అనుసంధానం చేసుకోవడం సులభమవుతుంది.
ఈ ప్రాంతంలో వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, ఇతర వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. డబిల్‌పూర్-మేడ్చల్ టెర్మినల్ (నిజామాబాద్-నాందేడ్ మార్గం): నిజామాబాద్-నాందేడ్ వైపు నుంచి వచ్చే రైళ్లకు ఇది ఒక ప్రధాన కేంద్రంగా మారుతుంది. ఇది మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామిక, గృహ నిర్మాణ రంగాలకు కొత్త ఊపు ఇస్తుంది. 2047 నాటికి హైదరాబాద్ జనాభా 3.3 కోట్లకు పెరుగుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. ఈ జనాభా వృద్ధికి అనుగుణంగా రైలు ప్రయాణ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ కొత్త టెర్మినల్స్ కేవలం ప్రయాణికుల రద్దీని తగ్గించడమే కాకుండా, నగరం యొక్క పారిశ్రామిక, వ్యాపార వృద్ధికి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ టెర్మినల్స్ చుట్టూ లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, ఇతర అనుబంధ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తుంది. ఈ కొత్త టెర్మినల్స్ నిర్మాణం హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత ముఖ్యమైన వాణిజ్య, రవాణా కేంద్రంగా మార్చడంలో సహాయపడతాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు పనుల విస్తరణ కారణంగా చుట్టుప్రక్కల ఉన్న భూములకు డిమాండ్ పెరిగింది. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు, మెట్రో రెండో దశ ప్రతిపాదనలు, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. హౌసింగ్ బోర్డు నిర్వహించిన భూముల వేలానికి సైతం అనూహ్య స్పందన లభించింది. రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూలమైన మార్పు రావడంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థలాలు, భూములను ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ సన్నద్ధమవుతోంది. గతంలో భూముల అమ్మకాలకు అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. కోకాపేట్, బుద్వేల్, మోకిల తదితర ప్రాంతాల్లో భారీ స్పందన లభించింది. అలాగే తుర్కయంజాల్, తొర్రూరు, బాచుపల్లి, మేడిపల్లి తదితర ప్రాంతాల్లోనూ హెచ్‌ఎండీఏ ప్లాట్లు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలిన స్థలాలతో పాటు కొత్త వెంచర్లలోనూ విక్రయాలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
బహదూర్‌పల్లి, లేమూరు, ఇన్ముల్ నెర్వా తదితర ప్రాంతాల్లో త్వరలో వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీ నుంచి షాద్‌నగర్ వరకు కొత్త వెంచర్లకు డిమాండ్ కనిపిస్తోంది. కొత్తగా విలీనమైన గ్రామాల్లో ఇప్పుడు భారీ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. ఘట్‌కేసర్, శంషాబాద్, శంకర్‌పల్లి, మేడ్చల్ తదితర అన్ని జోన్లలో లే అవుట్లు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతుల్లో జాప్యాన్ని నివారించేందుకు హెచ్‌ఎండీఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో కొంతకాలంగా అనుమతుల ప్రక్రియలో వేగం పెరిగింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 922 అనుమతులను ఇచ్చారు. మరో ఆరు నెలల్లో అనుమతులు రెట్టింపయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం 2024లో మొత్తం 878 అనుమతులు మాత్రమే ఇచ్చారు. కానీ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 922 అనుమతులు ఇవ్వడం విశేషం. గత సంవత్సరం అన్ని అనుమతులపై హెచ్‌ఎండీఏకు రూ. 395.13 కోట్ల ఆదాయం లభించగా ఈ సంవత్సరం జూన్ వరకు రూ.519 కోట్లకు పైగా ఆదాయం లభించింది. మరోవైపు 2023 సంవత్స రంలో 1,361 అనుమతులు ఇచ్చారు. రూ.563.32 కోట్ల ఆదాయం లభించింది. టీజీబీపాస్ స్థానంలో కొత్తగా బిల్డ్‌నౌను ప్రవేశపెట్టిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ కూడా సులభతరమైంది. క్షణాల్లోనే డాక్యు మెంట్‌లను అప్‌లోడ్ చేసే సదుపాయం లభించింది. మరోవైపు దరఖాస్తుదారులకు కూడా ఎలాంటి జా ప్యం లేకుండా ‘కీ’లు లభిస్తున్నాయి. కొన్ని సాంకే తిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దరఖాస్తు ప్రక్రియ మాత్రం వేగవంతం అయినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు దేశంలో వేర్‌హౌస్ మార్కెట్ ఆల్‌టైం హైకి చేరుకుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో పారిశ్రామిక గోడౌన్లలో దాదాపు 20 మిలియన్ చ.అ. లీజు లావాదేవీలు జరిగాయి. వార్షిక ప్రాతిపది కన 33 శాతం వృద్ధి నమోదైందని కొలియర్స్ నివేదిక వెల్లడిరచింది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఢిల్లీ, చెన్నై వేర్‌హౌస్ మార్కెట్‌లో ఆధిపత్యాన్ని చెలాయి స్తున్నాయి. మొత్తం లీజింగ్‌లో సగం వాటా ఈ రెండు నగరాలదే. గ్రేడ్ ఏ గిడ్డంగులు, పారిశ్రామిక షెడ్లకు సంబంధించిన స్థల సేకరణలో థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ కీలకంగా ఉన్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వచ్చిన డిమాండ్‌లో దాదాపు 32 శాతం వీరిదే.. ఒక్క త్రీపీఎల్ కాకుండా ఇంజనీరింగ్, ఈ కామర్స్, ఆటో మొబైల్స్, రిటైల్ సంస్థలతో సహా చాలా విభాగాల నుంచి డిమాండ్ పెరిగింది. 2025 రెండో త్రైమాసి కంలో పారిశ్రామిక, గిడ్డంగుల రంగం టాప్ 8 నగరాల్లో దాదాపు 11 మిలియన్ చ.అ. డిమాం డ్‌ను చూసింది. ఇది సంవత్సరానికి 52% పెరుగుదల. ఇందులో 60 శాతం వాటాతో ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలు దేశీయ పారిశ్రామిక గిడ్డంగుల రంగాన్ని ముందుకు నడిపించాయి. దీంతోపాటు ఫోర్త్ సిటీ ఏర్పాటుతో ఇప్పుడు హైదరాబాద్ నగరం మరింతగా విస్తరిస్తోంది. దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు పుంజుకుంటున్నాయి. దీంతో నగరం చుట్టుప్రక్కల ఉన్న భూములకు డిమాండ్ కనిపిస్తోంది.