అందరికీ ఇళ్ళు….మన ఊరిలో ఎన్ని?

కేంద్రం ప్రవేశపెట్టిన అందరికీ ఇళ్లు పథకంలో ప్రైవేటు సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. రూ.38,003 కోట్ల వ్యయంతో 17 రాష్ట్రాల్లోని 53 పట్టణాల్లో 352 ప్రాజెక్టుల ద్వారా 2,03,851 ఇళ్లను నిర్మించడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్)లో సభ్యులు ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్టులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆహ్మదాబాద్‌లో ప్రారంభించారు. అత్యధికంగా మహారాష్ట్రలోని 9 పట్టణాల్లో రూ.15,576 కోట్లతో 1,03,719 ఇళ్లు నిర్మించనున్నారు. తెలంగాణలో హైదరాబాద్ పరిధిలో రూ.663 కోట్లతో 1784 ఇళ్లు నిర్మిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో రూ.10 కోట్లతో 50 ఇళ్లు నిర్మించాలని సంస్థలు నిర్ణయించాయి. క్రెడాయ్ వెల్లడించిన లెక్కల ప్రకారం ఒక్కో ఇంటిపై రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఖర్చువుతుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం (పట్టణ0 కింద రూ.95,660 కోట్లతో 17,73,052 ఇళ్లను నిర్మించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పథకంలో భాగంగా ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.లక్ష నుంచి రూ.2.35 లక్షల వరకూ అందిస్తుంది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ ఇళ్ల పథకంలో ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి అన్నారు. తమ శాఖతోపాటు నేషనల్ హౌసింగ్ బ్యాంక్, హడ్కో నుంచి సంపూర్ణ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములైనందకు క్రెడాయ్‌ను అభినందించారు. గుజరాత్‌లో కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని, అక్కడ జన్మించిన మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని అన్నారు. సర్దార్ పటేల్ దేశానికి ఒక్కటిగా ఉంచడానికి కృషి చేశారని, ప్రధాని మోడీ నూతన భారతాన్ని నిర్మిస్తున్నారని అన్నారు.