Telangana: ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టుపై కేంద్రం ముందడుగు

హైదరాబాద్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగ్‌గా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత్తా వంటి ప్రధాన నగరాలతో సమానంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడంలో హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డును తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌గా దీనిని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు సుమారు 40 కి.మీ దూరంతో రెండు భాగాలుగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఉత్తర భాగం సంగారెడ్డి నుంచి గజ్వేల్, భువనగిరి చౌటుప్పల్ వరకు నిర్మిస్తున్నారు. ఈ భాగం సుమారు 158 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి కంది (సంగారెడ్డి జిల్లా) వరకు ఓఆర్‌ఆర్‌కు సమాంతరంగా నిర్మించబడుతుంది. ఈ భాగం సుమారు 182 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మ్నెత్తంగా దాదాపు 340 కి.మీ పొడవుతో రింగు రోడ్డును నిర్మిస్తున్నారు.
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టు అంశంలో కీలక ముందడుగు పడిరది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) ఎట్టకేలకు కేంద్రానికి చేరింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించింది. ఉత్తర భాగంలోని రహదారుల నిర్మాణానికి రూ.8వేల కోట్లు, భూసేకరణ కింద ఇవ్వాల్సిన నష్టపరిహారానికి అదనపు నిధులు అవసరమని డీపీఆర్‌లో పేర్కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ డీపీఆర్.. ప్రాజెక్టు అప్రైజల్ టెక్నికల్ స్క్రూట్నీ కమిటీ చెంతకు చేరింది. ఈ కమిటీ ఆమోదం లభించిన తర్వాత డీపీఆర్.. పబ్లిక్-ప్రైవేటు-పార్టనర్‌షిప్ అప్రైజల్ కమిటీకి వెళ్తుంది. ప్రాజెక్టు నిర్మాణం, వ్యయం, ఆదాయం సహా పలు కీలక అంశాలపై ఈ కమిటీ సమీక్షిస్తుంది. ఈ కమిటీ కూడా ఆమోదిస్తే ఫైలు కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళుతుంది. ఇదే చివరి దశ. ఈ రహదారి వల్ల దేశవ్యాప్తంగా ఎంత మేర రవాణా జరుగుతుంది, రాబడి ఎలా ఉంటుంది సహా వివిధ అంశాలపై కేంద్ర మంత్రివర్గం సమగ్రంగా చర్చిస్తుంది. అయితే, ఆయా అంశాలను పరిశీలించాకే ఆర్‌ఆర్‌ఆర్‌ను మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ ఆమోదం త్వరగానే లభిస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తంగా 2016లో రాష్ట్రానికి మంజూరైన ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టులో ఉత్తరభాగం ఏళ్ల తర్వాత కీలకదశకు చేరుకుందని అధికారులు అంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డిలో మొదలై చౌటుప్పల్ వరకు 161 కిమీల మేర ఉందన్న విషయం తెలిసిందే.
మరోవైపు ఉత్తర భాగానికి సంబంధించి ప్రస్తుతం 4 వరుసల రహదారి పనులకు సంబంధించి టెండర్ల గడువును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 3, 2025 వరకు పొడిగించింది. గత ఏడాది డిసెంబర్ 27న ఆర్‌ఆర్‌ఆర్ పనులకు తొలిసారి టెండర్లు పిలిచినా.. సాంకేతిక సమస్యల కారణంగా ఫిబ్రవరిలో బిడ్‌లను తెరవలేకపోయారు. ముఖ్యంగా, కేంద్ర మంత్రివర్గం ఆమోదం లేకుండానే గతంలో ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు ఆహ్వానించడం ఒక సమస్యగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారిని 4 వరుసల నుండి 6 వరుసల రహదారిగా మార్చాలని విజ్ఞప్తి చేయడంతో ఎన్‌హెచ్‌ఏఐ మరోసారి ట్రాఫిక్ సర్వే నిర్వహించి 6 వరుసల రహదారి నిర్మాణానికి అంగీకరించింది.