Real Estate: హైదరాబాద్‌లో అపార్టుమెంట్ల జోరు
దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్ల విక్రయాలు, లాంచింగ్స్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని సర్వేలో వెల్లడైంది. అలాగే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లు.. గ్రేటర్ నగరానికే వన్నెను తీసుకు వస్తున్నాయి. వేల చదరపు అడుగుల్లో ఉండే క్లబ్‌హౌస్, ఏసీ జిమ్, స్విమ్మింగ్‌పూల్ వంటి సౌకర్యాల్ని సక్రమంగా నిర్వహించడం కత్తిమీద సామే. అయితే నగరానికి చెందిన కొన్ని నిర్మాణ సంస్థలు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతల్ని స్వయంగా నిర్వహిస్తే.. మరికొన్నేమో.. సదుపాయాల నిర్వహణ సంస్థలకు అప్పగిస్తున్నాయి. నిర్వహణ పక్కాగా ఉండటం వల్ల ఫ్లాట్ల రేట్లు రెట్టింపవుతున్నాయి.ఈ ఏడాది మూడో త్రై మాసికం (క్యూ3)లో నగరంలో 17,658 యూనిట్లు అమ్ముడుపోయాయని, గతేడాది ఇదే త్క్రెమాసికంలో విక్రయమైన 11,564 యూనిట్లతో పోలిస్తే ఇది 52.7 శాతం పెరుగుదల అని పేర్కొంది.
అలాగే ఈ క్యూ3లో 12,530 యూనిట్లు లాంచింగ్ అయ్యాయని, గతేడాది ఇదే కాలంలో 8,546 ఫ్లాట్ల లాంచింగ్స్‌తో పోలిస్తే ఇది 46.6 శాతం ఎక్కువని తెలిపింది. ప్రస్తుతం నగరంలో అపార్ట్మెంట్ల చ.అ. ధర సగటున రూ.7,750గా ఉంది. 2024 క్యూలో ఇది రూ.6,858గా ఉంది. హైదరాబాద్ స్థిరాస్తి రంగ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందని ప్రాప్‌టైగర్ సర్వే అభిప్రాయపడిరది. బలమైన, స్థిరమైన ఆర్థిక పునాదులు, ఐటీ రంగ వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధికి చోదకాలుగా నిలుస్తున్నాయని వివరించింది. అలాగే డిజిటలైజ్డ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ విధానంతో పారదర్శకత, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపుతున్నాయని పేర్కొంది. అలాగే పాత బస్తీ మెట్రో కారిడార్, రీజినల్ రింగ్ రోడ్లతో భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేసింది.
మరోవైపు దేశంలో ఆఫీసు స్పేస్ లీజింగ్‌లు అదరగొట్టాయి. టారిఫ్‌లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఐటీ, ఐటీఈఎస్ రంగాలలో తొలగింపులు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ దేశంలోని ప్రధాన నగరాల్లో ఆఫీసు స్పేస్ డిమాండ్ బలంగానే ఉంది. 2025 తొలి తొమ్మిది నెలల్లో దేశంలోని ఏడు నగరాలలో ఆఫీసు స్పేస్ వినియోగ రేటు 4.2 కోట్ల చ.అ.లను అధిగమించింది. గతేడాదితో పోలిస్తే ఇది 34 శాతం అధికం. ప్రధానంగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), టెక్ ఆధారిత కంపెనీలు ఇందుకు దోహదపడ్డాయి. ఆఫీసు స్పేస్ వినియోగంలో 99.5 లక్షల చ.అ.లతో బెంగళూరు టాప్‌లో నిలిచింది. తర్వాత ఢలీి ఎన్సీఆర్లో 82 లక్షల చ.అ., ముంబై 66 లక్షల చ.అ.లతో ఉన్నాయి. మొత్తం లీజింగ్‌లో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల 27 శాతం వాటాతో ఆఫీసు స్పేస్ డిమాండ్‌లో అగ్రగామిగా కొనసాగుతుండగా.. కో%-%వర్కింగ్ స్పేస్‌లు 23 శాతం, బీఎఫ్ఎస్ఐ 18 శాతం వాటాలతో ఉన్నాయి.
గతేడాదితో పోలిస్తే ఐటీ రంగంలో ఒక శాతం తగ్గుదల నమోదైంది. జీసీసీలు కీలకమైన డిమాండ్ డ్రైవర్లుగా ఉద్భవించాయి. 2025లో ఇప్పటి వరకు స్థూల లీజింగ్ కార్యకలాపాలలో 40 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే నగరాల్లో జీసీసీల ఏర్పాటుకు డిమాండ్ అధికంగా ఉంది. డేటా సెంటర్ల జోరు కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని పరిగణనలోకి తీసుకుంటే దేశీయంగా డేటా సెంటర్ల సామర్థ్యం 2027 నాటికి రెట్టింపు కానుంది. ప్రాజెక్ట్‌లను వేగవంతం చేస్తే 2030 నాటికి ఐదు రెట్లకు పెరుగుతుందని మెక్వారీ ఈక్విటీ రీసెర్చ్ వెల్లడిరచింది. డేటా లొకేలైజేషన్ చట్టాలు, సానుకూల నియంత్రణ విధానాలు, ప్రభుత్వ సబ్సిడీలు, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 1.4 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యం ఉండగా.. మరో 1.4 గిగావాట్ల ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయని, నాలుగు గిగావాట్ల ప్రాజెక్ట్‌లు ప్రణాళిక దశలో ఉన్నాయని తెలిపింది.
హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, లగ్జరీ ప్లాట్ల నిర్మాణాలు బాగా జోరుగా సాగుతున్నాయి. దీంతోపాటు అవసరమైన సౌకర్యాలను కూడా కల్పిస్తుండటంతో చాలామంది ఈ కమ్యూనిటీ ప్రాజెక్టులలో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. 2006లో జీవో నం.86 అందుబాటులోకి వచ్చాక నగరంలో ఆకాశహర్మ్యాల సంఖ్య పెరిగింది. కొన్ని ప్రాజెక్టుల్లో ఆయా సంస్థలు సదుపాయాలు, సౌకర్యాల నిర్వహణను చూసుకుంటున్నాయి.






