Minister Ponnam : ఓట్ల కోసమే బీజేపీ భగవంతుడిని రాజకీయాల్లోకి : మంత్రి పొన్నం

బీజేపీ ఓట్ల కోసం మాత్రమే భగవంతుడిని వాడుకుంటుందని, రాజకీయాల్లోకి తీసుకొస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) గంగాధరలో నిర్వహించిన జనహిత పాదయాత్రలో మాట్లాడుతూ తెలంగాణలో కూడా 8 మంది బీజేపీ ఎంపీలు ఓట్ల చోరితోనే గెలిచి ఉండొచ్చన్న అభిప్రాయం వెలిబుచ్చారని చెప్పారు. కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)కు ధైర్యం ఉంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఓట్ల చోరీ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాలని టీపీసీసీ చీఫ్‌తోపాటు సీఎంను మంత్రి పొన్నం కోరారు. తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల చట్టం చేస్తే, మతం పేరు చెప్పి బీజేపీ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.