Gudiwada Amarnath: ఏపీలో దావోస్ ‘చలి’ మంటలు.. అమర్నాథ్ రాజీనామా ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు దావోస్ ‘చలి’ మంటలు పుట్టిస్తోంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విసిరిన ఒక సవాల్, ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ వీడియో వార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. రాజకీయాల్లో మాట జారడం ఎంత ప్రమాదమో, ఆ జారిన మాటను ‘నేను అనలేదే’ అని బుకాయించడం అంతకంటే ప్రమాదమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఇప్పుడు అర్థమై ఉంటుంది. వైసిపి ప్రభుత్వ హయాంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా చక్రం తిప్పిన అమర్నాథ్, ఇప్పుడు తన పాత వ్యాఖ్యల వల్లే ‘సెల్ఫ్ గోల్’ వేసుకున్నారనే చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సులో బిజీగా ఉన్నారు. అక్కడ ఆయన పెట్టుబడుల వేటలో ఉండగా, గత ప్రభుత్వ పనితీరుపై ఒక చిన్న సెటైర్ వేశారు. గతంలో వైసిపి మంత్రి దావోస్ వెళ్లమంటే ‘అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది’ అని సాకు చెప్పి ఎగ్గొట్టారని లోకేశ్ విమర్శించారు. సాధారణంగా ఇలాంటి విమర్శలను రాజకీయంగా తిప్పికొట్టడం పరిపాటి. కానీ, గుడివాడ అమర్నాథ్ కాస్త ఎమోషనల్ అయ్యారు. “నేను ఎప్పుడూ అలా అనలేదు.. ఒకవేళ నేను చలి వల్ల దావోస్ వెళ్లలేదని అన్నట్లు నిరూపిస్తే, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా” అంటూ ఏకంగా పొలిటికల్ రిటైర్మెంట్ ఛాలెంజ్ చేసేశారు.
అమర్నాథ్ సవాల్ విసిరిందే తడవుగా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగింది. పాత వీడియోల కోసం గాలించి, సరిగ్గా ఆయన ‘చలి’ గురించి మాట్లాడిన క్లిప్పింగ్‌ను బయటకు తీశారు. ఆ వీడియోలో అమర్నాథ్ చాలా స్పష్టంగా.. “జనవరిలో అక్కడ విపరీతమైన మైనస్ డిగ్రీల చలి ఉంటుంది.. అందుకే మేం ఆ సమయంలో వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం” అని అప్పట్లో మీడియా ముఖంగానే చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో వాట్సాప్ గ్రూపులు, ఎక్స్ లో వైరల్ అవుతోంది. “మరి ఎప్పుడు రిటైర్ అవుతారు అమర్నాథ్ గారు?” అంటూ నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో సాగుతున్న రచ్చ మామూలుగా లేదు. “అప్పట్లో చలి అని వెళ్లలేదు.. ఇప్పుడు వీడియోలు చూసి చెమటలు పడుతున్నాయా?” అని కొందరు.. “రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ముహూర్తం ఎప్పుడు?” అని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
నిజానికి, అప్పట్లో ఆయన అన్న మాటల ఉద్దేశం.. జనవరిలో వెళ్లడం కంటే మే నెలలో వెళ్లడం లాభదాయకమని కావచ్చు. కానీ, ఇప్పుడు ‘అస్సలు అననే లేదు’ అని సవాల్ చేయడమే ఆయన చేసిన అతిపెద్ద తప్పుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్తలు కూడా “అనవసరంగా కెలుక్కుని దొరికిపోయారు” అని అంతర్గత చర్చల్లో తలపట్టుకుంటున్నారు.
డిజిటల్ యుగంలో నాయకులు ఏది మాట్లాడినా అది రికార్డ్ అయి ఉంటుందనే విషయాన్ని అమర్నాథ్ మరిచిపోయినట్లున్నారు. లోకేశ్‌ను విమర్శించబోయి, తన పాత వీడియోనే తనకు విలన్‌గా మారుతుందని ఆయన ఊహించలేదు. ఇప్పుడు ఆ వీడియో సాక్ష్యంగా నిలవడంతో, అమర్నాథ్ తన సవాల్‌పై ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తానికి, దావోస్ మంచు కంటే.. ఆ చలి గురించి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కువ వేడి పుట్టిస్తున్నాయి!






