High Court : పాతబస్తిలో చారిత్రక కట్టడాలకు… ఎలాంటి నష్టం చేయొద్దు : హైకోర్టు

పాతబస్తిలో మెట్రో నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టు (High Court)లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై విచారణ జరిగింది. యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (Act for Public Welfare Foundation) వేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. మెట్రో నిర్మాణం (Metro construction) వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని ఫౌండేషన్ తన పిటిషన్‌లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ వాదనలు వినిపించారు. పురావస్తుశాఖ (Archaeology) గుర్తించిన చారిత్రక కట్టడాలకు నష్టం లేకుండా చూస్తున్నామని ఈ సందర్భంగా ఏఏజీ కోర్టుకు తెలిపారు. చారిత్రక కట్టడాలను కూలగొట్టడం లేదని చెప్పారు. పరిహారం చెల్లించాకే స్థలాలు సేకరించి నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ఏఏజీ సమయం కోరారు. ధర్మాసనం స్పందిస్తూ మెట్రో నిర్మాణ పనుల్లో భాగంగా చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయకూడదని సూచించింది. పురావస్తుశాఖ గుర్తించిన చారిత్రక కట్టడాల వద్ద ఎలాంటి పనులు చేపట్టకూడదని ఆదేశించింది. ఈ నెల 22లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం (Court), పిటిషన్‌పై తదుపరి విచారణను 22 కి వాయిదా వేసింది.