Jupally Krishna Rao: పర్యాటక రంగంలో పెట్టుబడులు పెడితే .. మెరుగైన రాయితీలు: మంత్రి జూపల్లి

తెలంగాణ పర్యాటక రంగం (Tourism)లో పెట్టుబడులు పెడితే మెరుగైన రాయితీలు, ప్రభుత్వం తరపున పూర్తి సహకారాన్ని అందిస్తామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తెలిపారు. ముంబయిలో జరిగిన దక్షిణాసియా హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ వర్క్ షాప్ (South Asia Hotel Investment Workshop ) లో పలు హోటళ్లు (Hotels), ట్రావెల్స్ (Travels ) సంస్థల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నామని, దేశంలో ఎక్కడాలేని విధంగా ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. తెలంగాణ ఆతిథ్య రంగంలో పెట్టుబడులతో పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. తెలంగాణలో 2030 నాటికి రూ.15 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ, 3 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు పర్యాటకుల సంఖ్యలో దేశంలో తెలంగాణను తొలి 5 స్థానాల్లో నిలపాలనే ఆశయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.