త్వరలోనే జీనోమ్ వ్యాలీ రెండో దశ : సీఎం రేవంత్

త్వరలోనే హైదరాబాద్‌లో జీనోమ్ వ్యాలీ రెండోదశను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హెచ్‌ఐసీసీలో నిర్వహించిన బయో ఏషియా 2024 సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ 300 ఎకరాల్లో రూ.2వేల కోట్ల పెట్టుబడులతో రెండోదశ జీనోమ్ వ్యాలీని నెలకొల్పనున్నామని, రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని తెలిపారు. దీని ద్వారా మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలొస్తాయని, 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లలో ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక గంట ప్రయాణ దూరంలోనే వీటిని ఏర్పాటు చేస్తున్నందున ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరికీ ఎంతో సదుపాయంగా ఉంటుందని అన్నారు. సదస్సు సందర్భంగా అంకుర సంస్థలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సీఎం సందర్శించారు. ఈ ఏడాది జీనోవ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారానికి ఎంపికైన నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్. సెమెంజాను సీఎం అభినందించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెమెంజాకు అవార్డును అందజేశారు.