Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Rising Global Summit) అంచనాలకు మించి విజయవంతమైంది. రెండో రోజు కూడా సమ్మిట్ సందడిగా సాగింది. రెండు రోజుల్లో రూ.5 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు సంబందించిన ప్రతిపాదనలు రావడంతో ప్రభుత్వం ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఏర్పాట్ల నుంచి నిర్వహణ వరకు సమ్మిట్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈ సమ్మిట్ కారణంగా మీర్ఖాన్పేట ప్రాంతంలో ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి (Future City) కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. తారల తళుకులు, రెండో రోజు సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలతోపాటు సినీ, క్రీడారంగ ప్రముఖులు హాజరయ్యారు.
మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, సినీ ప్రముఖులు చిరంజీవి (Chiranjeevi), అజయ్ దేవగన్, అర్జున్ కపూర్, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, జెనీలియా, అక్కినేని అమల తదితరులు సందడి చేశారు. మంత్రి అజారుద్దీన్‌తోపాటు ప్రముఖ క్రీడాకారులు అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand), పీవీ సింధు, గుత్తా జ్వాల, బోరియా మంజూదార్, అంబటి రాయుడు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో పలు కంపెనీలు ఒప్పందాలు కుదర్చుకున్నాయి.
– NS GOUD






