Minister Komatireddy: పవన్ కల్యాణ్ తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పు:మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక
పవన్‌కల్యాణ్ తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పు అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) హెచ్చరించారు. తెలంగాణపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. గాంధీభవన్‌లో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ క్షమాపణలు చెబితే నీ సినిమాలు నైజాంలో రెండు రోజులైనా ఆడుతయి. క్షమాపణలు చెప్పనిపక్షంలో ఇక్కడ నీ సినిమాలు నడవవు. ఉమ్మడి రాష్ట్రంలో తాము 60 ఏళ్ల పాటు బాధలు పడ్డామని, ఫ్లోరైడ్ నీళ్లు తాగి బతికామని, వాళ్లు తెలంగాణ నిధులు, నీళ్లు, ఉద్యోగాలనూ తీసుకెళ్లారన్నారు. హైదరాబాద్ ఆదాయంతో విజయవాడ (Vijayawada) , వైజాగ్(Vizag) సహా సీమాంధ్రలోని మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటై దాదాపు 13 ఏళ్లయిన తర్వాతా పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవసరమా అని నిలదీశారు. ఆయన ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఉంటారని, కానీ ఇలాంటి వ్యాఖ్యలు సరికావని అన్నారు. పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి మంచి వ్యక్తి అని, ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నడూ చేయలేదని కితాబునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని, తాము ఆ అప్పులు కడుతూ ఇప్పుడే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ సమాజాన్ని పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడటం మంచిదికాదన్నారు.






