అమెరికాలో తెలుగు యువకుడు మృతి

అమెరికాలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సిరిపురపు రవికుమార్ (26)మృతి చెందాడు. కోదాడకు చెందిన శ్రీనివాస్- పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు రవికుమార్ గత మూడేళ్ల నుంచి అమెరికాలోని సిగ్నా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారంతపు సెలవు కావడంతో స్నేహితులతో బోటింగ్‍కు వెళ్లాడు. బోటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. రవికుమార్ మృతిపై స్నేహితులు అతడి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. చేతికి అందివచ్చిన కొడుకు కానరాని లోకానికి వెళ్లిపోవడంతో రవికుమార్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు సాయం చేయాలని తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు.