డిప్లొమాటిక్ అవుట్రీచ్ సదస్సులో మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రభుత్వమే పూర్తి భరోసా కల్పిస్తోందని, పారిశ్రామికవేత్తల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన ప్రతీ సంస్థా లాభాలను ఆర్జిస్తోందని, నష్టపోయిన వారు ఎవరూ లేవరని అన్నారు. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్సిటీలో ఉన్న టీ-హబ్లో జరిగిన దౌత్య సంబంధాలతో చేరువ (డిఫ్లొమాటిక్ అవుట్రీచ్) కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. 50 దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సుల్ జనరళ్లు, హై కమిషనర్లు, ట్రేడ్ కమిషనర్లు పాల్గొన్న సమావేశంలో కేటీఆర్ తెలంగాణ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, గత ఎనిమిదేళ్ళలో సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తుంటే, భారత్లోని అన్ని రాష్ట్రాలూ తెలంగాణ వైపు చూస్తున్నాయని, ఇక్కడ పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు.






