Ponnam Prabhakar : దేశానికి దిక్సూచిగా నిలిపేందుకే 2047- విజన్ : మంత్రి పొన్నం
కల్వకుంట్ల కవిత చెప్పినట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంగారు తెలంగాణ విజన్ వారి ఇంటి నుంచి బయటకు రాకపోవచ్చునని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar, ) ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రపంచంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం అన్ని అంశాల ప్రణాళికలతో తెలంగాణ రైజింగ్ కార్యక్రమం చేపట్టిందన్నారు. గతంలో చంద్రబాబు (Chandrababu) విజన్-2020 అంటే, దేశానికి దిక్సూచిలా తెలంగాణను నిలిపేందుకు తమ ప్రభుత్వం 2047 విజన్‌తో ముందుకెళ్తున్నదన్నారు. అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలు కోర్ అర్బన్ రీజియన్, సెమీ అర్బన్ రీజియన్, రూరల్ రీజియన్‌గా విభజించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ను అతిక్రమించకుండానే ఈ నెల 3న పట్టణ ప్రాంతమైన హుస్నాబాద్‌లో సభ నిర్వహిస్తున్నట్లు పొన్నం స్పష్టం చేశారు. విద్యా ఉపాధి, వ్యవసాయ రంగాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తారన్నారు. గ్రామాల్లో ఎన్నికల కోడ్ ఉండటం వల్ల తాము ఏర్పాట్లు చేయడం లేదని, ప్రజలే స్వచ్ఛందంగా తరలి వస్తున్నారన్నారు.






