దళితుల కోసం రాజకీయాలకతీతంగా ముందుకు సాగుదాం : కేసీఆర్

దళితుల అభివృద్ధి కోసం దశల వారీగా కార్యాచరణ అమలుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రకటించారు. దళితులకున్న సామాజిక, ఆర్థిక బాధలు తొలిగిపోవాలంటే ఏం చేయాలో దశలవారీగా కార్యాచరణ అమలుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే విధి విధానాల రూపకల్పనపై సూచనలు చేయాలని అఖిలపక్ష నేతలను సీఎం కోరారు. ‘‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్’ పథకం విధి విధానాల రూపకల్పనపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి మల్లు భట్టివిక్రమార్క, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రదం, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, మజ్లిస్ తరపున బలాలా, పాషా ఖాద్రి, టీఆర్‌ఎస్ తరపున మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు హాజరయ్యారు. అయితే బీజేపీ మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉండిపోయింది. పార్టీ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వానికి చాలా కీలక పాత్ర అని, ఓ రకంగా చంటి పిల్లల్ని పెంచి నట్లుగా పెంచాల్సి ఉంటుందని అన్నారు.
ఈ మార్గంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్ తరాలు నష్టపోతాయని హెచ్చరించారు. దీనికి పూర్తిగా పాలకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకూ ఏ ప్రాంతానికి వెళ్లినా, దళితులు నష్టపోతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సాధికారతకు పైరవీలు లేని పారదర్శక విధానాన్ని అమలు చేద్దామని సీఎం సూచించారు. అయితే దీనికి సంబంధించిన నిధుల బాధ్యత మాత్రం ప్రభుత్వ పక్షాన తాము భుజాలకెత్తుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘‘సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ విజయవంతం చేయాలన్నదే నా లక్ష్యం. దళితుల అభ్యున్నతి కోసం అఖిలపక్షం సూచనలు ఇవ్వాలి. దళిత సాధికారతకు పైరవీలు ఉండకూడదు. రాజకీయాలకు అతీతంగా సమష్టి కార్యాచరణ తీసుకుందాం. రైతులకిచ్చే ఆర్థిక సాయం నేరుగా వారికే అందేలా చర్యలు తీసుకుందాం’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈసారి బడ్జెట్‌లో ‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్’ పథకానికి 1000 కోట్లు కేటాయిస్తామని, మరో 500 కోట్లు పెంచడానికి కూడా తాము సిద్ధమేనని సీఎం కేసీఆర్ ప్రకటించారు.