Revanth Cabinet: ఆశావహులకు రేవంత్ దసరా బొనాంజా..!?

తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ పార్టీ (congress party) అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రిగా, భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడే పలువురిని తన మంత్రివర్గంలోకి (Cabinet) తీసుకున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఇప్పటికీ మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే ఇదిగో అదిగో అని ఎంతోకాలంగా ఊరిస్తోంది అధిష్టానం. కానీ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు (Cabinet expansion) ముహూర్తం దగ్గర పడిందని చెప్తున్నారు. దసరా వేళ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది. పీసీసీ చీఫ్ గా (PCC Chief) ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 9 నెలలపాటు ఆయన రెండు పదవులూ నిర్వహించారు. ఇప్పుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. దీంతో మిగిలిన పదవుల భర్తీపైన కూడా హైకమాండ్ దృష్టి సారించింది. ఖాళీలు భర్తీ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సమర్పించిన జాబితాల మధ్య వ్యత్యాసం ఉండడంతో ఏకాభిప్రాయానికి రాలేకపోతోంది హైకమాండ్.
మంత్రివర్గాన్ని విస్తరించాలనే డిమాండ్ ఎంతోకాలంగా ఉంది. ఆరుగురిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆశావహులు మాత్రం భారీగా ఉన్నారు. అయితే ఆరుగురిలో నాలుగు పేర్లపై ముగ్గురు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. ఇద్దరి పేర్లపై భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి విభేదిస్తున్నట్టు సమాచారం. అందుకే విస్తరణ ఆలస్యమవుతోందనే టాక్ వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మల్ రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy), పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy), గడ్డం వివేక్ (Gaddam Vivek), వాకిటి శ్రీహరి (Vakiti Sreehari) పేర్లు దాదాపు ఖాయమని భావిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (Komatireddy Rajagopal Reddy) కూడా ఛాన్స్ ఉండొచ్చని చెప్తున్నారు. అదే సమయంలో బాలు నాయక్ (Balu Naik), రాంచందర్ నాయక్ (Ram Chandar Naik) లలో ఒకరికి పదవి వరించే అవకాశం కనిపిస్తోంది. మైనార్టీలలో ఒకరిని కేబినెట్ లోకి తీసుకోవాలనుకుంటున్నారు. అదే జరిగితే ఎమ్మెల్సీ ఆమెర్ అలీఖాన్ (Amer Ali Khan) కు మంత్రి పదవి ఖాయం.
మంత్రివర్గంలో ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad), రంగారెడ్డి (Ranga Reddy), నిజామాబాద్ (Nizamabad), హైదరాబాద్ (Hyderabad) జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు. అందుకే ఈ జిల్లాలకు ప్రాతనిధ్యం కల్పించనున్నారు. మరోవైపు BRS పార్టీ నుంచి వచ్చిన వారిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని మొదట భావించారు. అయితే ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు రాకపోవడంతో పార్టీని విలీనం చేసుకోవడం సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కేబినెట్లో స్థానం కల్పిస్తే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆలోచిస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి BRS నేతలెవరికీ మంత్రివర్గంలో స్థానం లేనట్టే.