Nara Lokesh: లోకేష్ మాట నిలబెట్టుకున్నారా..?
సాధారణంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విషయంలో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వెనకడుగు వేస్తూ ఉంటాయి. ఓట్ల కోసం చెప్పే మాటలే గాని సమాజ అభివృద్దికి చేసేది ఏం ఉండదు అంటూ ఆరోపణలు వస్తూ ఉంటాయి. కానీ ఈ విషయంలో ఏపీలో కూటమి సర్కార్ మాత్రం దూకుడుగా వెళ్తోంది. ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తూ ప్రజల మన్నలను పొందుతోంది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మెగా డీఎస్సీ సహా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
పెంచిన పెన్షన్(Pension Scheme) లు, అమరావతి, పోలవరం నిర్మాణాలు వంటివి దూకుడుగా ముందుకు వెళ్ళింది. ఇప్పుడు మరో కీలక కార్యక్రమాన్ని అమలు చేసింది సర్కార్. తాజాగా కానిస్టేబుల్ నియామకాలను రాష్ట్ర సర్కార్ చేపట్టింది. మొత్తం 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో 6,014 మందిని సెలెక్ట్ చేసారు. ఇక వీరిలో 5,757 మంది ట్రైనింగ్‌కు ఎంపిక చేసారు. ఇక సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపిక చేసింది.
వారికి నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. అలాగే వారికి ఇచ్చే స్టైఫండ్ ను కూడా 12,500 కు పెంచింది. వాస్తవానికి ఈ నియామకాల హామీ మంత్రి నారా లోకేష్.. యువగళం పాదయాత్రలో ఇచ్చారు. దీనిపై లోకేష్ స్వయంగా ప్రకటన చేసారు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పేర్కొన్నారు. తన హామీని నెరవేర్చేందుకు కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియను ఒక యజ్ఞంలా చేపట్టి పూర్తిచేసిన హోంమంత్రి వంగలపూడి అనితకు లోకేష్ ధన్యవాదాలు చెప్పారు.
ఈ పోస్టుల భర్తీని అడ్డుకునేందుకు వేసిన కుట్రపూరిత కేసులను, ప్రభుత్వం అత్యంత చాకచక్యంగా పరిష్కరించడం వెనుక అధికార యంత్రాంగానికి హోంమంత్రి పూర్తి సహాయ, సహకారాలు అందించారని అభినందించారు. సీఎం, డిప్యూటీ సీఎం(Pawan Kalyan) చేతుల మీదుగా కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన హోంమంత్రికి, అధికార, పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.






