GRMB: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై జీఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖ

గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లకుండా ఆపాలని కోరుతూ గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) (GRMB) కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) కార్యాలయం ప్రత్యేక లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు, తాడిపూడి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఎలాంటి టెండర్లు పిలవకుండా చూడాలని కూడా తెలంగాణ కోరింది. ఈ నెల 7న జరిగిన బోర్డు సమావేశంలో ఇదే విషయాన్ని లేవనెత్తామని తెలంగాణ గుర్తు చేసింది. అప్పుడు గోదావరి-బనకచర్ల ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని జీఆర్‌ఎంబీ (GRMB) ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ సభ్యులు సమాధానం ఇచ్చారని పేర్కొంది. అయితే, ఆ మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఆలస్యం చేయకుండా ఆంధ్రప్రదేశ్‌ను తక్షణమే నిలువరించాలని తెలంగాణ తన లేఖలో విజ్ఞప్తి చేసింది.