కేంద్ర కేబినెట్ లోకి సోయం బాపూరావు ?

కేంద్ర కేబినెట్‍లో తెలంగాణ రాష్ట్రానికి మరో బెర్త్ దక్కనుంది. గిరిజన కోటాలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు ఈ జాక్‍పాట్ దక్కనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం వివిధ రాష్ట్రాల గిరిజన ఎంపీల డేటా, గిరిజన ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల పరిస్థితులను భేరీజు వేసుకున్న కేంద్రం భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా బాపూరావు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ప్రధాని మోదీ బాపూరావుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే తెలుసుకున్నట్లు తెలిసిది. తన కేబినెట్‍లో ఇప్పటికే సామాన్యులకు అవకాశం కల్పించిన నరేంద్ర మోదీ తెలంగాణలో రాజకీయ సమీకరణలు మార్చే అంశంపై ఫోకస్ పెట్టింది.
తెలంగాణలో గిరిజన నియోజకవర్గాలు 12 ఉండగా, ఆంధప్రదేశ్‍లోనూ గిరిజనుల సంఖ్య భారీగా ఉంది. తెలంగాణలో రెండు లోక్‍సభ నియోజకవర్గాలు ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడ్‍గా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రం కేంద్ర కేబినెట్‍లో కిషన్‍రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రాధాన్యత కలిగిన పోర్ట్ ఫోలియోలో పనిచేస్తున్నారు. ఇపుడు మరో సహాయమంత్రి పదవిని ఇవ్వాలని నిర్ణయించడం బీజేపీ వర్గాలను ఆనందానికి గురి చేస్తోంది.