Minister Seethakka: ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక : మంత్రి సీతక్క
వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశించారు. కామారెడ్డి జిల్లా (Kamareddy District ) లో వరద పరిస్థితిపై ఆమె అధికారులతో టెలికాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ఇళ్లను పరిశీలించి, ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ముంపులో ఉన్న ఇళ్ల నుంచి నీరు బయటికి పంపే చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్, వ్యవసాయ, తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖలు తక్షణం నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు మనోధైర్యం కల్పించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలని ఆదేశించారు. వాగులు, చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. త్వరలోనే జిల్లాలో పర్యటించి పరిస్థితులను సమీక్షిస్తానని సీతక్క తెలిపారు.
అధికారులు జిల్లాలోని వర్షాల తీవ్రత, వరద ఉధృతి, నష్ట పరిస్థితులపై మంత్రికి వివరాలు అందించారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ, అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. వర్షం పూర్తిగా ఆగే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali), జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ (, MP Suresh Shetkar) , కలెక్టర్, ఎస్పీ, అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.







