Minister Seethakka: మంత్రి సీతక్కకు ఈశ్వరీబాయి స్మారక పురస్కారం
కొన్ని వర్గాలకు అంబేడ్కర్ అంటే ద్వేషమని, అందుకే వారంతా రాజ్యాంగాన్ని నమ్మవద్దంటూ నిరంతరం ప్రచారం చేస్తుంటారని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్టు సంయుక్త నిర్వహణలో రవీంద్ర భారతిలో ఈశ్వరీబాయి (Ishwaribai) 107వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad), మాజీ మంత్రి గీతారెడ్డి, మంత్రి వివేక్ తదితరులు సీతక్కకు ఈశ్వరీబాయి స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అంబేడ్కర్‌ను స్మరించుకుంటే ఏమొస్తుంది. దేవుడిని తలుచుకోండి, స్వర్గానికి వెళతారు అంటూ ఓ సందర్భంలో అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు అణగారిన వర్గాలపట్ల వారి దృక్పథాన్ని తెలియజేస్తున్నాయని విమర్శించారు. అటవీ సంపదను కొల్లగొడుతూ, అడవి బిడ్డలను ఏం చేస్తున్నారో మనమంతా చూస్తున్నామని కేంద్రాన్ని ఉద్దేశించి అన్నారు. ఆడబిడ్డలకు విద్యావకాశాలు కల్పించడంలో ఈశ్వరీబాయి పాత్ర శ్లాఘనీయమని స్పీకర్ అన్నారు. తెలంగాణ కోసం ఈశ్వరీబాయి చేసిన కృషిని మంత్రి వివేక్ గుర్తుచేశారు.






