సీఎం కనుసన్నల్లోనే బీఆర్ఎస్ నాయకులపై దాడులు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ దాడులకు దిగుతోందంటూ ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే విచక్షణారహితంగా పట్టపగలే దాడులకు తెగబడుతున్నారని, ఇది సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో కలిసి డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశారు. ‘‘నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయింది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. పట్టపగలే పోలీసుల ఎదురే దాడులకు దిగుతుండడం నిజంగా దారుణం. అచ్చంపేటలో పుట్టి పెరిగిన రేవంత్ రెడ్డికి ఇదంతా తెలియదని నేననుకోను. మా నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డికి ప్రాణ హాని ఉంది. వెంటనే వారికి రక్షణ కల్పించి, దాడులకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అంటూ ప్రవీణ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయంపై మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై బాధితులు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వారి దగ్గరికి పోలీసులే వచ్చి ప్రాణహాని ఉందంటూ హెచ్చరిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.