తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు?

కోవిడ్ రెండో వేవ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆదాయ వనరులను సమకూర్చుకునే పనిలో నిమగ్నమైంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే కొన్ని భూములను అమ్మాలని ప్రతిపాదన కూడా గతంలో పెట్టింది. కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఢీలా పడటంతో, ఆ ప్రభావం సంక్షేమ రంగాలపై పడకూడదని కేసీఆర్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి నిలిపింది. అందులో భాగంగా భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం భేటీ అయ్యింది. ఈ సమావేశానికి మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల మంత్రి ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. భూముల విలువ పెంపు అనే అంశం రాష్ట్రంలో చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. భూముల విలువలను సవరించాలని ఇదే మంత్రివర్గ ఉపసంఘం కొన్ని రోజుల క్రితం కూడా ప్రతిపాదించింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి రిజిస్ట్రేషన్ విలువను పెంచలేదని, దీర్ఘకాలంలో పెండింగ్‌లో ఉన్న భూముల విలువను వెంటనే సవరించాలని అధికారులు ప్రతిపాదించారు.
ఏపీలో గడిచిన 8 ఏళ్లలో 7 సార్లు రిజిస్ట్రేషన్ విలువ 7 శాతంగా ఉందని, తమిళనాడులో కూడా 7.5 శాతంగా ఉందని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. తక్కువ రిజిస్ట్రేషన్ విలువతో రుణాలకు ఇబ్బందులు వస్తున్నాయని, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయాభివృద్ధితో గ్రామాల్లోనూ భూములు విలువ భారీగా పెరిగిందని అధికారులు మంత్రివర్గ ఉపసంఘం ముందు అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకున్న మంత్రివర్గ ఉప సంఘం… భూముల విలువలను సవరించాలని, త్వరలోనే సీఎం కేసీఆర్‌కు దీనిపై నివేదిక కూడా సమర్పించాలని నిర్ణయించింది.