Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి (Amaravati) మీదుగా బందరు పోర్ట్ వరకు 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కి విజ్ఞప్తి చేశారు. గడ్కరీతో సమావేశమై రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతులు, పనుల వేగవంతంపై చర్చించారు. హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు (నార్త్)కు 90 శాతం భూ సేకరణ పూర్తయింది. వెంటనే ఆర్థిక, క్యాబినెట్ అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించండి. ఈ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ఆర్‌ఆర్‌ఆర్ ( సౌత్) పనులు చేపట్టడానికి వీలుగా అన్ని అనుమతులు మంజూరు చేయాలి. శ్రీశైలం (Srisailam) తో హైదరాబాద్‌ను అనుసంధానించే మన్ననూర్`శ్రీశైలం రహదారి అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో ఉంది. అందువల్ల నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలి. ఈ కారిడార్ పూర్తయితే ఏపీలోని కృష్ణపట్నం రేవుతో పాటు మార్కాపురం, కుంభం, కనిగిరి, నెల్లూరులకు రాకపోకలు సులువవుతాయి. అలాగే రావిర్యాల-ఆమనగల్లు-మన్ననూర్ నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మించాలన్నారు.