Revanth Reddy: యంగ్ ఇండియా స్కూళ్లకు మద్దతు తెలపండి : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ విద్యా రంగంలో సమూల మార్పులు తేవడానికి తాము చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సుమారు 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం రాష్ట్రంలో 105 శాసనసభ నియోజకవర్గాల్లో (Assembly constituencies) 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల (Young India Integrated Schools) ను నిర్మిస్తున్నందున అందుకు అవసరం అయ్యే ఆర్థిక వనరుల సమీకరణకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రి కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నాలుగు పాఠశాలల నిర్మాణ పనులు మొదలయ్యాయి. మిగతా వాటికి టెండర్లు ముగిశాయి. ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నాం. అత్యాధునిక వసతులు, ల్యాబ్‌లు, స్టేడియాలతో నిర్మించే ఈ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా.