CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ వరకు హైదరాబాద్ మెట్రో విస్తరణ: సీఎం రేవంత్

హైదరాబాద్ మెట్రో రైలు సేవలను ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఈ మేరకు తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. మెట్రో రెండో దశ విస్తరణపై సమీక్షించిన సీఎం.. ప్రాజెక్టు పురోగతిపై వివరాలు కోరారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో అనుమతుల కోసం చర్చలు ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ వరకు దాదాపు 40 కిలోమీటర్ల మేర మెట్రో లైన్‌ను విస్తరించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ (CM Revanth Reddy) సూచించారు.
భవిష్యత్తులో నగర విస్తరణను దృష్టిలో ఉంచుకొని, మెట్రో లైన్‌ను మీర్‌ఖాన్‌పేట్ వరకు పొడిగించాల్సిన అవసరాన్ని సీఎం హైలైట్ చేశారు. దీనికోసం అవసరమైన ఖర్చుల అంచనాలతో కూడిన డీపీఆర్‌ను (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) రూపొందించి కేంద్రానికి పంపించాలని సీఎం రేవంత్ చెప్పారు. హెచ్‌ఎండీఏ, ఎఫ్‌ఎస్డీఏ సంయుక్తంగా ఈ మెట్రో విస్తరణ బాధ్యతలు తీసుకోవాలని ఆయన (CM Revanth Reddy) సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు అధికారుల వివరించారు. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి అనుమతులు రాగానే తక్షణమే పనులు ప్రారంభించేలా సిద్ధంగా ఉండాలని సీఎం (CM Revanth Reddy) సూచించారు.