మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిలపై కేసు

రెండున్నర ఎకరాల భూ వివాదంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదైంది. పేట్ బషీరాబాద్‌లోని ఓ ప్రైవేటు భూమిలోకి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ దౌర్జన్యంగా ఫెన్సింగ్ కూలగొట్టి మరీ చొరబడ్డారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కాగా, సుచిత్ర ప్రాంతంలో రెండు ఎకరాల స్థలం విషయంలో మల్లారెడ్డికి కొంతమందితో వివాదం నెలకొంది. స్థలం తనదని, అక్రమంగా కబ్జా చేసి ఫెన్సింగ్ వేశారని ఆరోపించిన మల్లారెడ్డి.. తన అనుచరులతో బలవంతంగా ఫెన్సింగ్ తీసేయించారు. ఈ క్రమంలో మల్లారెడ్డికి, అవతలి వ్యక్తులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టి కంచెను దౌర్జన్యంగా తొలగించినందుకుగానూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.