Mahesh Kumar Goud: కంచ గచ్చిబౌలి భూమిని ప్రైవేటీకరించే ఆలోచనే లేదు: మహేష్ కుమార్ గౌడ్

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్న భూములను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా కాపాడుతోందని ఆయన చెప్పారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా సృష్టించిన నకిలీ వీడియోలను చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా తప్పుదోవ పట్టారన్నారు. ఈ నకిలీ వీడియోల వాస్తవం తెలిసిన తర్వాత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలను తొలగించారని ఆయన వెల్లడించారు. “సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాల భూములను విక్రయించింది. కేటీఆర్ తన అనుచరులకు వేలాది ఎకరాల భూములను అప్పనంగా కట్టబెట్టారు. ఎకరం రూ. 100 కోట్లు పలికే విలువైన భూములను కేవలం రూ. 30 లక్షలకే విక్రయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు అనేక సందర్భాలలో తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది” అని మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విమర్శించారు.