Mahesh Kumar Goud: వేల ఎకరాలను కేసీఆర్ తన వారికి అప్పనంగా కట్టబెట్టారు: మహేశ్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేసిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud).. గత 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాల విలువైన భూములను తనవారికి కేసీఆర్ అప్పగించారని మండిపడ్డారు. “కంచ గచ్చిబౌలిలోని భూములపై గత పదేళ్లలో ఎందుకు పోరాడలేదు? హెచ్‌సీయూ భూముల వివాదం కోర్టులో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? ఐఎంజీ సంస్థకు చెందిన బిల్లీరావుతో కమీషన్ మాట్లాడుకొని.. ఆ భూమి గురించి కేసీఆర్ సర్కారు నోరుమెదపలేదు” అని మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) నిలదీశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో పోరాడి మరీ ఐఎంజీ చేతికి వెళ్లే పరిస్థితిలో ఉన్న 400 ఎకరాలను తిరిగి సాధించామని ఆయన తెలిపారు. “కమీషన్ దక్కలేదనే కోపంతోనే కేటీఆర్ ఇప్పుడు తమను విమర్శిస్తున్నారు” అని మహేశ్ కుమార్ ఆరోపించారు. టీజీఐఐసీ ద్వారా తీసుకున్న రూ.10,000 కోట్ల రుణాన్ని రైతుల రుణమాఫీకి వినియోగించామని తెలిపారు. కోకాపేటలో భూములను రూ.100 కోట్లకు ఎకరం చొప్పున అమ్మినప్పుడు పర్యావరణం గుర్తు రాలేదా? అని ఆయన (Mahesh Kumar Goud) ప్రశ్నించారు. “బీఆర్ఎస్ పాలనలో లక్ష ఎకరాలు డీఫారెస్ట్ చేసి విక్రయించడమే కాకుండా, భూదోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు 400 ఎకరాల్లో పరిశ్రమలు వస్తే లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు” అని మహేశ్ కుమార్ (Mahesh Kumar Goud) హితవు పలికారు. కేసీఆర్ పాలనలో పదేళ్లలో జరిగిన భూ దోపిడీపై బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు.