ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు.. ఇప్పుడు తెలంగాణకు ఎంతో ముఖ్యం.. కేటీఆర్

ప్రస్తుతం తెలంగాణ ఉన్న పరిస్థితుల్లో అధికార స్వరాలు అవసరం లేదని.. అన్యాయాన్ని ఎదిరించే ధిక్కార స్వరాలే కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే అన్యాయాలను ప్రశ్నించే గొంతులు కావాలని ఆయన తన ట్వీట్ లో వెల్లడించారు. ఖమ్మం-వరంగల్- నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కేటీఆర్ ఈ ట్వీట్ పెట్టారు. ఇందులో రాకేష్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. యువకుడు, ఉన్నత విద్యావంతుడు అయిన రాకేష్ లోతైన విషయ పరిజ్ఞానం కూడా ఉంది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎదిరించాలంటే యువతకు గొంతుకగా ఆయన నిలుస్తారని.. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని కేటీఆర్ అన్నారు.
అలాగే రాకేష్ రెడ్డి ప్రస్థానాన్ని కూడా ఆయన తన ట్వీట్ లో వివరించారు. హనుమకొండ జిల్లాలోని ఒక మామూలు గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రాకేష్ రెడ్డి.. ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకమైన బిట్స్ పిలానీలో విద్యాభ్యాసం పూర్తి చేశారని.. మేనేజ్మెంట్, ఎకనామిక్స్ లో ఆయనకు డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ ఉందని కేటీఆర్ చెప్పారు. పలు అంతర్జాతీయ కంపెనీలలో ఏడు సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి.. తెలంగాణ ప్రజల సేవ కోసం ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టారని.. తెలంగాణ భవిష్యత్తుకు ఇటువంటి వారు ఎంతో అండదండగా ఉంటారని కేటీఆర్ అన్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజలు రాకేష్ రెడ్డికి అండదండగా నిలిచి గెలిపించాలని పిలుపునిచ్చారు.