డీఎఫ్ఈ ఫార్మా సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
డీఎఫ్ఈ ఫార్మా హైదరాబాద్‌లో నెలకొల్పిన కీలకమైన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. క్లోజర్ టు ఫార్ములేటర్ (సీ2ఎఫ్)గా పనిచేసే ఈ సెంటర్ వివిధ ఫార్మా స్యూటికల్ కంపెనీలకు వాటి ఔషధ అభివృద్ధిలో అన్ని దశల్లోనూ నైపుణ్యాన్ని అందించి, వాణిజ్య ఉత్పత్తికి అవసరమయ్యే సమయాన్ని తగ్గిస్తుంది. జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డీఎఫ్ఈ పార్మా హైదరాబాద్‌లోని జెనోమ్ వ్యాలీలో సీ2ఎఫ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ డీఎఫ్ఈ ఫార్మా సీ2ఎఫ్‌తో జీనోమ్ వ్యాలీ అందిస్తున్న మద్దతు, వృద్ధిని మరింత పటిష్టపరుస్తుందని, రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఈ సదుపాయాన్ని వినియోగించుకునే దిశగా డీఎఫ్ఈ ఫార్మాతో తెలంగాణ ప్రభుత్వ కలసి పనిచేస్తుందన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్ అయిన జీనోమ్ వ్యాలీలోని ప్రధాన ప్రాంతంలో ఏర్పాటు చేసిన తమ సీ2ఎఫ్ ద్వారా ఫార్మాస్యూటికల్, న్యూట్రాన్యూటికల్ కంపెనీలు వాటి ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తయ్యేందుకు సహకరిస్తుందని డీఎఫ్ఈ ఫార్మా సీఈవో మార్టి హెడ్మాన్ తెలిపారు.






