కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం ఖాయం: కేటీఆర్
KTR: భారత రాష్ట్ర సమితి (BRS) పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో జరిగిన పార్టీ సమావేశం అనంతరం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన.. రాజకీయ పొత్తుల విషయంలో తమకు చేదు అనుభవాలు ఉన్నాయని, ఇకపై ఎవరితోనూ పొత్తులు ఉండబోవని స్పష్టం చేశారు.
గత తప్పిదాలపై విశ్లేషణ:
గత ప్రభుత్వ హయాంలో కొన్ని చిన్నపాటి లోపాలు జరిగాయని కేటీఆర్ ఈ సందర్భంగా అంగీకరించారు. ప్రజలకు, నాయకులకు మధ్య దూరం పెరగడం వల్లనే ఆశించిన ఫలితాలు రాలేదని, ఆ పొరపాట్లపై ఇప్పటికే లోతైన అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఈ లోపాలను సరిదిద్దుకుని మళ్లీ ప్రజల్లోకి వెళ్తామని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై విమర్శలు:
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ఇక డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 179కి, పార్లమెంట్ స్థానాలు 28కి పెరుగుతాయని ఆయన తెలిపారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
చరిత్రలో నిలిచిపోయే నలుగురు సీఎంలు:
తెలుగు రాష్ట్రాల చరిత్రలో నలుగురు ముఖ్యమంత్రులు మాత్రమే తమ పాలనతో చెరగని ముద్ర వేశారని కేటీఆర్ అభివర్ణించారు. ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు నాయుడుతో పాటు కేసీఆర్ పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుందని ఆయన ప్రశంసించారు. చంద్రుడిపై మబ్బులు కమ్మినంత మాత్రాన వెలుగు తగ్గదని, కేసీఆర్ మళ్లీ ఉజ్వలంగా ప్రకాశిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.






