స్కూటీలు రాలేదు కానీ కాంగ్రెసోళ్ల లూటీలు మొదలయ్యాయి : కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లలకు స్కూటీలు రాలేదు కానీ, నాయకుల లూటీలు మాత్రం మొదలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలోని బాలాజీ గార్డెన్‌లో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం బ్రూ టాక్స్ నడుస్తోంది. మనందరికీ బ్రూ కాఫీ గురించి తెలుసు. కానీ ఇప్పుడు తెలంగాణలో మాత్రం స్పెషల్‌గా బ్రూ టాక్స్ నడుస్తోంది. అదెలాగంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి టాక్స్ అంటే యూ టాక్స్, రేవంత్ రెడ్డి టాక్స్ అంటే ఆర్ టాక్స్, భట్టి విక్రమార్క టాక్స్ అంటే బీ టాక్స్.. ఇలా రకరకాల ట్యాక్స్‌లు నడుస్తున్నాయి. ఈ రకంగా అక్రమంగా వసూళ్లకు పాల్పడి.. అలా దండుకున్న సొమ్మంతా ఢిల్లీకి కప్పం కడుతున్నారు’’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ విరుచుకుపడ్డారు.
అంతేకాకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ నిలువునా ముంచిందని, నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసినందుకు వెన్నుపోటు పొడిచిందని నిప్పులు చెరిగారు. ఇక ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లలో విజయం సాధించబోతోందన్న కేటీఆర్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.