కాంగ్రెస్ సర్కార్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ నిజానికి ఆ హామీలు ఆచరణ సాధ్యం కానివని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘చేతకాని, అసాధ్యమైన హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ హయాంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖజానాలో డబ్బులే లేవు. రైతుల రుణమాఫీ చేయాలంటే రూ.32 వేల కోట్లు కావాలి. మరి అది సాధ్యమయ్యే పనేనా..?’’ అంటూ విశ్వేశ్వర్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. అనంతరం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై కూడా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ‘‘తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీలనే కాంగ్రెస్ అమలు చేయలేకపోతోంది. ఇది చాలదన్నట్లు కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే.. రేషన్ షాపుల ద్వారా 5 కేజీలకు బదులు 10 కేజీల బియ్యాన్ని ఇస్తామని ఖర్గే చెబుతున్నారు. ఆయన కనీస ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నారు’’ అంటూ విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.