తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఖాయం: కిషన్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఖాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరించబోతోందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కిషన్ రెడ్డి.. బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. జూన్ 4వ తేదీన తెలంగాణలో అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి.. రాజ్యాంగం, రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ పోటీ పడి మరీ బీజేపీపై అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేశారని, అయినా తెలంగాణ ప్రజలు మోదీకి అండగా నిలిచారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోందని, ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగలనుండగా, తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం కోల్పోబోతోందని హాట్ కామెంట్స్ చేశారు. ‘‘తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం కనబడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ ఖాయంగా కనిపిస్తోంది. యువత, మహిళలు, రైతులు, కొత్త ఓటర్లు ఏకపక్షంగా బీజేపీకి అండగా నిలిచారు. మోదీనే మళ్లీ ప్రధాని కావాలన్న ఆకాంక్ష తెలంగాణ గ్రామాల్లో స్పష్టంగా కనిపించింది. తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా బీజేపీ ప్రభంజనం సృష్టించి 400కు పైగా సీట్లు సొంతం చేసుకోబోతోంది’’ అంటూ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.