Kishan Reddy: వక్ఫ్ భూములపై వచ్చే ఆదాయాన్ని పేద ముస్లింలకు పంచుతాం: కిషన్ రెడ్డి

వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్వహణపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక ప్రకటన చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు చెందిన సమస్త ఆస్తులను డిజిటలైజ్ చేసే ప్రక్రియను చేపడుతోందని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఈ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రమం తప్పకుండా బహిరంగంగా ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన (Kishan Reddy).. వక్ఫ్ బోర్డు ఆస్తుల ద్వారా వచ్చిన లాభాలను పేద ముస్లింలకు అందజేస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూమి కబ్జాకు గురైందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ముస్లిం సమాజం ఈ వాస్తవాలను గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో నిర్వహించే సమావేశాలకు అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణలోని ముఖ్యమైన అంశాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని పార్టీ నాయకులకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.