ఖైరతాబాద్ మహాగణపతికి .. కర్ర పూజ

వినాయక చవితి సమీపిస్తుండటంతో హైదరాబాద్‍లో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అందుకు అవసరమైన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ఏకాదశ రుద్ర మహా గణపతిగా భక్తులను కనువిందు చేయనున్నాడు. ఏర్పాట్లలో భాగంగా గణపతి ప్రాంగణంలో కర్రపూజ చేశారు. గౌరీభట్ల విఠలశర్మ సిద్ధాంతి సూచన మేరకు ఏకాదశ రుద్ర మహా గణపతి ప్రతిష్ఠాపనకు నిర్ణయించినట్లు శిల్పి రాజేంద్రన్, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ తెలిపారు. ఈ సారి ఖైరతాబాద్ గణేషుడిని 27 అడుగుల ఎత్తుతో చేయాలని భావిస్తున్నామని కమిటీ నిర్వాహకులు తెలిపారు. అయితే పోలీసు అనుమతులు, కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎత్తుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కర్ర పూర్తయిన నేపథ్యంలో.. సెప్టెంబర్ 10 కల్లా గణపతిని పూజలకు సిద్ధం చేస్తామని ఉత్సవ కమిటీ పేర్కొంది.