KCR : డిసెంబర్ నుంచి జనంలోకి కేసీఆర్..!?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి డిసెంబర్ (December) నాటికి ఏడాది పూర్తవుతుంది. అదే సమయంలో పదేళ్లపాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ (BRS) ఓడిపోయి కూడా 12 నెలలవుతుంది. కాబట్టి ఆయా పార్టీలు తమ పనితీరును సమీక్షించుకోవడానికి ఈ సమయం సరిపోతుంది. సరిగ్గా ఇదే ఆలోచనలో ఉన్నట్టున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR). ఏడాదిపాటు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలను బేరీజు వేసిన తర్వాత జనంలోకి వెళ్లాలనుకుంటున్నారు. అందుకే డిసెంబర్ నుంచి యాక్టివ్ అయ్యే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Govt) ఏర్పాటై ఇప్పటికి 10 నెలలవుతోంది. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసింది. వాటిలో కొన్ని మంచిపేరు తీసుకురాగా.. మరికొన్నింటిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష (Opposition) బీఆర్ఎస్ కూడా వాటిని ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం ఈ పది నెలల్లో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. వరదలు లాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఆయన బయటకు రాలేదు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయలేదు. దీంతో కేసీఆర్ తీరు అనేక విమర్శలకు తావిచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) కేసీఆర్ కనిపించట్లేదంటూ గజ్వేల్ (Gajwel) లో పోస్టర్స్ కూడా వేసింది.
ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. డిసెంబర్ నాటికి రేవంత్ ప్రభుత్వం ఏడాది పూర్తవుతుందని.. అప్పటి నుంచి జనంలోనే ఉండాలని కేసీఆర్ అనుకుంటున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు దానికి కొంచెం సమయం ఇవ్వాలనే ఆలోచనతోనే కేసీఆర్ మౌనంగా ఉంటున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. గతంలో తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం ఇద్దామని సూచించారు. అందుకోసమే ఇన్నాళ్లూ కేసీఆర్ కామ్ గా ఉంటున్నారని చెప్తున్నారు. బడ్జెట్ సమావేశాల రోజు మాత్రం కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఆ తర్వాత ఫాంహౌస్ కే పరిమితం అయ్యారు.
అయితే రేవంత్ రెడ్డి సర్కార్ కు హనీమూన్ పీరియడ్ ముగిసిందని.. త్వరలో కేసీఆర్ బయటకు రాబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. 5 గ్యారంటీల అమలు, హైడ్రా (HYDRA), మూసి ప్రక్షాళన (Musi River), పార్టీ నేతల ఫిరాయింపులు.. లాంటి అంశాలపై ప్రజాక్షేత్రంలోనే రేవంత్ ప్రభుత్వాన్ని ఎండగట్టేలా కేసీఆర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తనను కలుస్తున్న నేతలతో ఈ మేరకు ఆయన సంకేతాలు ఇస్తున్నట్టు సమాచారం. త్వరలోనే కేసీఆర్ బయటకు వస్తున్నారని తెలియడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంతోషపడుతున్నాయి. కేసీఆర్ బయటకు వస్తే సీన్ మొత్తం రివర్స్ చేయగలరనే నమ్మకంతో ఉన్నారు ఆ పార్టీ నేతలు.