బీఆర్ఎస్ నుంచి 25 మంది, బీజేపీ నుంచి ఐదుగురు జంప్: జగ్గారెడ్డి

బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు త్వరలో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాంబు పేల్చారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆగస్టులో తమ ప్రభుత్వం కూలిపోయే అవకాశమే లేదని, అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 25 మంది, బీజేపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. ‘‘ఆగస్టులో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని కిషన్ రెడ్డి అంటున్నారు. కానీ నిజానికి బీఆర్ఎస్ నుంచి 25 మంది, బీజేపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు.. అంటే మొత్తం 30 మంది కాంగ్రెస్‌లోకి రాబోతున్నారు. అప్పుడు మా బలం 90 ప్లస్‌కు చేరుకుంటుంది. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూలిపోయే అవకాశం ఎక్కడుంది..?’’ అంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.