బీఆర్ఎస్, బీజేపీలపై జగ్గారెడ్డి డబుల్ ఎటాక్

70 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారని, ఈ పదేళ్లలో అసలు ఈ రెండు పార్టీలు ప్రజల కోసం ఏం చేశాయో చెప్పాలని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. దేశంలో మంచి నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినవేనని గుర్తు చేశారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కరెంట్, ప్రాజెక్టులు, పరిశ్రమలు ఏమీ లేని పరిస్థితుల్లో, 40 కోట్ల మంది దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్న సమయంలో వాళ్ల ఆకలి తీర్చేందుకు నెహ్రూ ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణలో ఎస్ఆర్ఎస్పీ, మంజీరా, సింగూరు లాంటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ మంజీరా, సింగూరు నీళ్లు తాగిన వాళ్లేనని, ఈ ప్రాజెక్టులు నెహ్రూ కట్టించిన విషయం వాస్తవం కాదా? అని జగ్గారెడ్డి నిలదీశారు.
ఇక బీజేపీ పై విమర్శల వర్షం కురిపించిన జగ్గారెడ్డి.. ‘‘విశాఖ ఉక్కు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే.. దానిని మోదీ సర్కార్ అమ్మకానికి పెట్టింది. ఈ పదేళ్లలో బీజేపీ నేతలు ఎన్ని కంపెనీలు పెట్టారు? ఎంత మందికి ఉద్యోగాలిచ్చారు? మరి ఈ వివరాలు చెప్పగలిగే దమ్ముందా?’’ అంటూ సవాల్ విసిరారు. అంతేకాకుండా కేసీఆర్‌ను కూడా టార్గెట్ చేసిన జగ్గారెడ్డి.. ‘‘తెలంగాణలో అభివృద్ధంతా బీఆర్ఎస్ పార్టీనే చేసిందని కేసీఆర్ చెప్పుకుంటున్నారు. మరి 60 ఏండ్లు పాలించిన వాళ్లు ఏం చేయకుండానే ఈయన మొత్తం చేశాడా..?’’ అని మండిపడ్డారు.