కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన కిషన్ రెడ్డి: జగ్గారెడ్డి సెటైర్లు

కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారినట్లున్నారని, నిజంగా ఆయన చెప్పినట్లు బీఆర్ఎస్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే ప్రత్యేకంగా ఆయనకు సన్మానం చేస్తామని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెటైర్లు పేల్చారు. శుక్రవారం నాడు గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన జగ్గారెడ్డి.. “బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాదని తేలిపోయింది. అందుకే ఆ పార్టీ నేతలు రోజుకో భాష, రోజుకో వేషం మారుస్తున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి చాలా గొప్పగా అటల్ బిహారీ వాజ్‌పేయ్ దారిలో నడుస్తున్నట్లున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ ఆయనే ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా చూస్తే కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారినట్లనిపిస్తోంది. ఒకవేళ నిజంగా అంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే ముందుగా కిషన్ రెడ్డికే ప్రత్యేకంగా సన్మానం చేస్తాం. అయితే బీఆర్ఎస్ నేతలే కాదు.. బీజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వాళ్లు కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయం’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.