Ibomma Ravi : ఐ బొమ్మ రవికి పోలీసులు ఓ ఆఫర్!
సాంకేతికతపై ఉన్న పట్టుతో కొత్త సినిమాలను పైరసీ చేసి, సినీ పరిశ్రమకు చుక్కలు చూపించిన ఐ బొమ్మ రవి (Ibomma Ravi )కి పోలీసులు ఓ ఆఫర్ (Offer) ఇచ్చినట్లు సమాచారం. అతని తెలివితేటలను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు విచారణలో భాగంగా, పోలీసు శాఖలోకి వచ్చి, సైబర్ క్రైమ్ (Cybercrime) విభాగంలో పనిచేస్తావా? మంచి జీతం కూడా ఇస్తాం అని అడిగినట్లు తెలిసింది. రవి మాత్రం వారి ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు అనేక కొత్త విషయాలు రాబట్టినట్లు తెలిసింది. విచారణలో భాగంగా నీ బొమ్మ క్లోజ్ అయింది. తర్వాత ఏంటి? అని పోలీసులు ప్రశ్నించగా, కరేబియన్ దీవుల్లో (Caribbean Islands) ఒక రెస్టారెంట్ పెట్టి తెలంగాణ, ఆంధ్రాతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు రుచి చూపించి డబ్బు సంపాదిస్తానని రవి చెప్పినట్లు తెలిసింది. రెస్టారెంట్‌కు ఏం పేరు పెడతావని పోలీసులు ప్రశ్నించారు. ఐ బొమ్మ పేరే పెడతానని రవి బదులివ్వడం విశేషం. కొద్ది రోజుల్లోనే కరేబియన్ దీవుల్లోని అన్ని దేశాల్లో ఐ బొమ్మ రెస్టారెంట్ శాఖలను ఏర్పాటు చేస్తానని, భారత వంటకాలకు అక్కడి ప్రజలు అలవాటు పడేలా చేస్తానని రవి చెప్పినట్లు తెలిసింది.






