Global Summit: గ్లోబల్ సమిట్ లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు.. తెలంగాణ చరిత్రలోనే రికార్డు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ (Global Summit) వేదికగా రాష్ట్ర చరిత్రలోనే భారీగా పెట్టుబడులు (Investments) వచ్చాయి. రెండు రోజుల సమిట్లో ఏకంగా రూ.5,75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం ఎంవోయూలు కుదిరాయి. మొదటి రోజు సదస్సులో రూ.3,97,500 కోట్లకు ఒప్పందాలు కుదరగా, రెండోరోజు మంగళవారం రూ.1,77,500 కోట్లకు ప్రభుత్వంతో వివిధ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇన్ఫ్రాకీ డీసీ పార్క్స్ ఏకంగా రూ.70 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేసుకుంది. 150 ఎకరాల్లో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన ఏఐ రెడీ డేటా పార్క్ ఏర్పాటు చేస్తుంది. అలాగే రూ.9, వేల కోట్లతో జేసీకే ఇన్ఫ్రా (JCK Infra) ముందుకు వచ్చింది. డేటా సెంటర్స్ సదుపాయాలను విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి.
తెలంగాణ పర్యాటక రంగంలో మంగళవారం ఏకంగా రూ.7,045 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇవి కాకుండా ప్రధానంగా ఐటీ, విద్యుత్, క్రీడలు పర్యాటకం, అటవీ తదితర శాఖల్లోనూ పెట్టుబడులకు కంపెనీలు ఆసక్తి చూపాయి. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అభివృద్ధి చెందాలనే సంకల్పంతో నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్ సదస్సులో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా లక్ష్యం విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గ్లోబల్ సదస్సు ప్రాంగణంలో పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) తో సమావేశమయ్యారు.
– NS GOUD






