కాంగ్రెస్ చెప్పేవన్నీ జూటా మాటలే: హరీశ్‌రావు ధ్వజం

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ సర్కార్ జూటా మాటలతో మోసం చేస్తోందని, అబద్ధపు హామీలతో వంచిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ అంటే బడి పంతుళ్లపై లాఠీలు, బడుగు జీవులకు జూటా హామీలేనంటూ రేవంత్ పాలనపై మండిపడ్డారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి కానిలాల్ నాయక్‌కు నివాళులర్పించేందుకుగానూ హరీశ్‌రావు సోమవారం నాడు దేవరకొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. 6 నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి అమలు పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతులెత్తేశారని, ఎన్నికల ముందు ప్రియాంక, రాహుల్, రేవంత్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని విమర్శల వర్షం కురిపించారు.
‘‘ఉద్యోగులకు 3 డీఏలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క డీఏ కూడా రిలీజ్ చేయలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ ఇవ్వలేదు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయి. జర్నలిస్టులకు రూ.100 కోట్లు ఇస్తామని, వంద పైసలు కూడా ఇవ్వలేదు. ఇలాంటి పార్టీకి ఓట్లేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే’’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు మండిపడ్డారు.