విద్యుత్ వ్యవస్థను 5 నెలల్లోనే నాశనం చేశారు: మాజీ మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో విద్యుత్ వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ కుప్పకూల్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెప్పపాటు కూడా కోతలు లేకుండా ఏర్పాటు చేసిన పటిష్ఠమైన విద్యుత్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల కాలంలోనే పూర్తిగా సర్వనాశనం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అది చాలదన్నట్లు ప్రభుత్వ వైఫల్యాలను విద్యుత్తు ఉద్యోగులపై రుద్దేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న ఆయన.. ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపుతూ తమ తప్పును ప్రభుత్వం కప్పిపుచ్చుకుంటోందని తీవ్రంగా మండిపడ్డారు. అలాగే సీఎం రేవంత్ వ్యాఖ్యలను బట్టి చూస్తే కాంగ్రెస్ సర్కార్ తీరు ఆడరాక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందంటూ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు.
‘‘తెలంగాణ ప్రజలకు 24 గంటల పాటు నిరంతరం విద్యుత్తు సరఫరా చేసేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించాం. రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే ఆ వ్యవస్థను కుప్పకూల్చింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయేలా విద్యుత్తు సరఫరా చేయటంలో పూర్తిగా విఫలమైంది. ఇది కచ్చితంగా కాంగ్రెస్ చేతకాని తనానికి నిదర్శనం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు’’ అంటూ హరీశ్ రావు ఆరోపించారు. ఇకపై అయినా విద్యుత్తు ఉద్యోగులను నిందించాలనే చిల్లర చేష్టలు మానుకుని, 24 గంటలు ప్రజలకు విద్యుత్తును ఎలా అందించాలనే దానిపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌కు హరీశ్ రావు హితబోధ చేశారు.