రైతులతో కలిసి అసెంబ్లీ ముట్టడిస్తాం.. జాగ్రత్త: హరీశ్ రావు వార్నింగ్

అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు అన్ని రకాల వరి ధాన్యానికి క్వింటాకు రూ.500ల చొప్పున కాంగ్రెస్ సర్కార్ బోనస్ ప్రకటించాలని, లేకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వార్నింగ్ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా శుక్రవారం నాడు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులనుద్దేశించి మాట్లాడిన ఆయన.. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రూ.2 లక్షల మాఫీ అమలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ చేయలేదు. ధాన్యానికి ఇస్తానన్న బోనస్ ఇప్పటికీ ఇవ్వలేదు. అప్పుడేమో వరి పంటకు బోనస్ అన్న రేవంత్.. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ ఇస్తామని మెలిక పెడుతున్నారు. వెంటనే అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించాలి. లేకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తాం. జాగ్రత్త’’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్ రావు వార్నింగ్ ఇచ్చారు.