Harish Rao: సీఎం చేసే ఇలాంటి కుట్రలు ఫలించవు : హరీశ్ రావు
అనేక సార్లు చెప్పా, మళ్లీ చెబుతున్నా రాసి పెట్టుకోండి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎప్పటికైనా నా గుండెల్లో ఉండేది కేసీఆరే (KCR). నా చేతిలో ఉండేది గూలాబీ జెండానే అని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) స్పష్టం చేశారు. తనపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య లపై హరీశ్‌రావు స్పందించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన రేవంత్‌రెడ్డికి అసహనం పరాకాష్టకు చేరింది. రోజురోజుకీ పరిస్థితులు చేజారిపోతున్నాయనే సత్యం జీర్ణం కాక, సీఎం ఇష్టానుసారంగా మాట్లాడారు. త్వరలోనే పతనం తప్పదనే సంగతి అర్థమై ఆగమాగమవుతున్నారు. నాకు, కేటీఆర్‌కు (KTR) మధ్య మిత్ర భేదం సృష్టించాలని చూస్తున్నారు. తద్వారా బీఆర్ఎస్ను బలహీనపరచాలని కురచ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. సీఎం చేసే ఇలాంటి కుట్రలు ఫలించవు. కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలకు వ్యతిరేకంగా నేనూ, కేటీఆర్ మరింత సమన్వయంతో సమర్థంగా, రెట్టించిన ఉత్సాహంతో పోరాడతాం. తెలంగాణకు ద్రోహం చేస్తున్న రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ గద్దె దించడమే మా లక్ష్యం. బీఆర్ఎస్ విజయపథంలో పురోగమించి మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని పేర్కొన్నారు.






