Telangana :నాదర్గుల్ కబ్జాలపై హైడ్రా ఎందుకు రావట్లేదు: హరీశ్‌రావు
Harish Rao: హైదరాబాద్ శివార్లలోని నాదర్గుల్ భూముల స్కామ్‌లో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ కుంభకోణం విలువ సుమారు రూ.7 వేల కోట్లు ఉంటుందని ఆయన అంచనా వేశారు.
కేసీఆర్ కాపాడితే.. రేవంత్ భక్షిస్తున్నారు:
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములుగా ప్రకటించిన వాటిని కేసీఆర్ ప్రభుత్వం కాపాడిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఈ వివాదాస్పద భూములను నిషేధిత జాబితాలో పెట్టామని, ఆ నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్థించిందని చెప్పారు. ఇప్పటికీ రికార్డుల్లో ఇవి ప్రభుత్వ భూములుగానే ఉన్నాయని, కానీ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కబ్జాలు మొదలయ్యాయని విమర్శించారు.
హైడ్రా ఎందుకు రావట్లేదు?
నాదర్గుల్ భూములను కబ్జా చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని హరీశ్‌రావు ప్రశ్నించారు. అక్కడ అక్రమాలను అడ్డుకోవడానికి ‘హైడ్రా’ ఎందుకు రంగంలోకి దిగడం లేదని నిలదీశారు. లింగమయ్య గుట్టతో సహా వంద ఎకరాల గుట్టల్లో 12 ఎకరాలు మినహా మిగిలినవన్నీ కబ్జా చేశారని ఆరోపించారు.
ప్రభుత్వ పెద్దల వాటా ఎంత?
ఈ భారీ భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాటా ఎంత అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబంపై అధికారులు చర్యలు తీసుకుంటారా అని నిలదీశారు. అసెంబ్లీలో తాను చెప్పిన మాటలకు సీఎం కట్టుబడి ఉంటే, వెంటనే విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.






