పేద గల్ఫ్ కార్మికులకు ఉచిత క్వారంటైన్ : మహేష్ బిగాల
కరోనా మహమ్మారితో గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయి రాష్ట్రానికి తిరిగొస్తున్న పేద కార్మికులకు ఉచిత కార్వంటైన్ సదుపాయం కల్పించడంపై టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. కార్మికులకు హైదరాబాద్‌లో ఉచిత క్వారంటైన్‌ను ఏర్పాటు చేయాలన్న విన్నపానికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ దేశాల నుంచి చవ్చే కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమాచార విభాగం వద్దకెళితే, క్వారంటైన్ సదుపాయాలను కల్పిస్తారని చెప్పారు. వారం రోజులకు భోజనం, వసతికి కలిపి ప్రీమియం క్యాటగిరీకి రూ.16 వేలు, స్టాండర్డ్ విభాగానికి రూ.8 వేలు చెల్లించాల్సి ఉంటుందని, కానీ నిరుపేద గల్ఫ్ కార్మికులు, డబ్బు చెల్లించలేని వారి కోసం ప్రభుత్వం ఉచితంగా క్వారంటైన్ సౌకర్యం కల్పించిందని పేర్కొన్నారు. గల్ఫ్ నుంచి తిరిగొస్తున్న పేద కార్మికులకు ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఎన్నారై గల్ఫ్ దేశాల ప్రతినిధుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.






